జీవితంలో శ్రమలు, బాధలు మనల్ని ఆవహించినపుడు ఆవేదనతో కుంగిపోతాం.
ఇబ్బందులలో ఉంటే కలిగే అవమానాన్ని తలచుకుని భయపడుతుంటాం. మనల్ని మనం
శపించుకుంటూ దేవుణ్ని దూషిస్తూ, జీవిత ంపై విరక్తిని, వైరాగ్యాన్ని
పెంచుకుంటాం. జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు తమ జీవిత
కష్టాలకు, శ్రమలకు ఒక కొత్తకోణాన్ని కనుగొనవలసిన అవసరం, కొత్త దృక్పథాన్ని
అలవరచుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కష్టాలు, బాధలనుండి మనం పారిపోతే అవే
మనల్ని తరుముకువస్తాయి. జీవితంలో కష్టాల నుండి, శ్రమల నుండి పారిపోకుండా
సామర్థ్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే మనం వాటిని అధిగమించగలుగుతాం,
పరిష్కరించుకోగలుగుతాం.
‘‘శ్రమ దినమున నీవు కుంగిన ఎడల నీవు
చేతకాని వాడవగుదువు’’ (సామె 24:10) మనం ఎదుర్కొనే జీవిత సవాళ్ళు మనలో
దేవుడుంచిన శక్తి సామర్థ్యాలను వెలికితీస్తాయి. ‘‘దేవుడు మనకు శక్తి,
ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనముగల
ఆత్మనియ్యలేదు’’ (తిమోతి 1:7) గనుక పిరికితనంతో ఉండక, దైవమునందలి దృఢమైన
విశ్వాసంతో కష్టాలను, ఇబ్బందులను, శ్రమలన్నిటిని ధైర్యంగా ఎదురాడి
పోరాడాలి. కష్టానుభవం మనం ప్రభువు వైపునకు మరలుటకు, శ్రమల్లో విశ్వాసంతో
ప్రార్థించుటకు తద్వారా దైవసహాయంతో జీవితంలో కష్ట శ్రమలు అధిగమించుటకు
శ్రమలే పరోక్షంగా దోహదపడతాయి. కష్టానుభవాలను, జీవిత అధిరోహానికి మెట్లుగా
మలుచుకొన్న యోసేపును గూర్చి బైబిల్‌లో ఇలా చెప్పబడింది.
యోసేపు
అనునతడిని చిన్న వయసులోనే తన స్వంత అన్నలు అసూయతో కుట్రపూరితంగా
ఇస్మాయేలీయులు అను బానిస వర్తకులకు అమ్మివేశారు. అలా ఒక బానిసగా ఐగుప్తు
దేశంలోని పొతీఫరు అనునతని ఇంటిలో పనివాడుగా చేరుతాడు. అక్కడ నిందలపాలై,
తాను చేయని నేరానికి శిక్షగా జైలుపాలవుతాడు. అట్లుండగా ఒకనాడు ఆ దేశపు
రాజుకు కలిగిన స్వప్నానికి దైవజ్ఞానంతో భావమును వివరించి, ఫలితంగా
విడుదలనొంది, ఫారో రాజు దయనొందినవాడై, ఆ రాజు తరువాత అంతటి ప్రముఖ
అధిపతిగా, అధికారిగా ఎదిగాడు. యోసేపు తాను ఎదుర్కొన్న శ్రమలలో, ఇబ్బందులలో,
అవమానంతో కుంగిపోలేదు. ధైర్యాన్ని, దైవాన్ని వీడలేదు. అందుకే శ్రమలే అతని
ముందు ఓడిపోయాయి తప్ప అతని జీవితాన్ని నాశనం చేయలేదు.
శ్రమానుభవం
మనల్ని జీవిత వాస్తవాలలోనికి తీసుకువెళ్తుంది. జీవితాన్ని గూర్చిన శ్రద్ధ,
బాధ్యత, క్రమశిక్షణ, లక్ష్యం, ఆశయం అన్నవి లేకుండా జీవించే నిర్లక్ష్య
నిర్లిప్త జీవిత విధానం నుండి, జీవితానికున్న అర్థం, పరమార్థం తెలుసుకొని,
అర్థవంతంగా జీవించుటకు శ్రమలు, కష్టాలు, బాధలు కూడా పరోక్షంగా
ఉపకరిస్తాయి. ‘‘శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ
వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను’’ (కీర్తన 119:67) కష్టం కలుగక
మునుపు జీవితాన్ని గూర్చి మనకున్న అవగాహన వేరు, కష్టాలను ఎదుర్కొన్న తరువాత
జీవితం మనకు కనిపించే తీరు వేరు.
దేవుని పట్ల అచంచల విశ్వాసం ఉన్న
వ్యక్తి తన జీవిత శ్రమలను, ఇబ్బందులను దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో,
సామర్థ్యంతో ఎదుర్కోగలిగే పరిస్థితులను, అవకాశాలను గూర్చి అన్వేషిస్తాడు.
శ్రమల తరువాత కలిగే సత్ఫలితానికై నిరీక్షిస్తాడు. కష్టాలు, శ్రమలు నేర్పే
నిజ జీవిత పాఠాన్ని నేర్చుకుంటాడు. తన చుట్టూ అలుముకొన్న కష్టపరిస్థితులకు
అతీతంగా విశ్వాసంతో నడవగలుగుతాడు. కాబట్టి శ్రమలకు కుంగక, బెదరక ఓ మంచి
దృక్పథంతో చూసి సమర్థవంతంగా ఎదుర్కొందాం. కష్టాలు మనకు నేర్పే జీవితపాఠాలను
నేర్చుకుందాం. అప్పుడే జీవితంలో నిజ విజయాన్ని సాధిస్తాం.
- రెవ. పి. ఐజక్ వరప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి