15, డిసెంబర్ 2011, గురువారం

తెలవారనీకు స్వామీ...

డా॥చింతకింది శ్రీనివాసరావు


లైఫ్ టార్గెట్లు మారిపోయాక, గజీ‘బిజీ’గా జీవితం ఏమారిపోయాక, మనకిప్పుడు మిగిలినవన్నీ వారాలే తప్ప ఆదివారాలు అంటూ స్పెషల్‌గా ఏమీ లేకుండా పోయాయి. రోజూ అలుపెరుగని పరుగులే. సండేనాడూ తేడా లేదు. బండెడు హోమ్‌వర్క్‌లతో పిల్లలు, ముంచుకొచ్చే మరో వారాన్ని ఎటాక్ చేసేందుకు పెద్దలు... ‘వీక్’ ప్లాను గీసుకుంటుంటారు.

ఆఫీసులో పెండింగ్ పనితల్చుకుని మనసు గాభరాపడుతుంది. సెల్‌ఫోన్ రింగు రింగు రింగుమంటుంది. దాంతో సండే పనిఅయిపోయినట్టే. మన్డే వచ్చిపడినట్టే. కథ మళ్లీ మామూలే.

రవివారం ఇప్పుడింత ఘోరవి వారంగా మారింది కానీ గతంలో ఎంతగా మనిషికి ఆనందం పంచేదో! మరెంతగా కుటుంబమంతటినీ సంతోషాల్లో ముంచేదో! అసలా రోజుల్ని తల్చుకుంటే చాలు, మనసంతా హాయిలో మునిగేది. అప్పట్లో ఆదివారం ఎలా ఉండేది! నికార్సయిన సెలవు దినంలా ఉండేది. ఆ వాతావరణమే వేరు. పిల్లలంతా ఉదయాన్నే ఎవరూ లేపకుండానే నిద్రలేచిపోయేవారు. వారమంతా పట్టిపీడించే బడిభూతం ఆనాడు దరికిరాబోదని తల్చుకుని చెలరేగిపోయేవారు. ఎవరూ చేయించకుండానే స్నానాలు కానిచ్చి, అమ్మ పెట్టింది తిని, నిక్కరు జేబుల్లో గోళీలు పోసుకుని వీధుల్లో వీరంగాలేసేవారు.

ఇంకొందరైతే గాలిపటాలు పట్టుకుని ఆకాశంలోకి దూరిపోయేందుకు బీడుభూముల్ని శరణువేడేవారు. తీరుబడిగా లేచిన నాన్నారు కాఫీ గ్లాసుతో కుంపటి పక్కన చేరేవారు. అమ్మతో కష్టం సుఖం కలబోసుకునేవారు. ఆ వారంలో వచ్చిన ఉత్తరాలు పత్తరాలు, వెళ్లాల్సిన పెళ్లిళ్లు... ఒకటేంటి, అమ్మానాన్నల మాటలే కుటుంబబంధాలకు బాటలు.

ఇక అమ్మాయిలకయితే అప్పట్లో ఆదివారం వెరీ స్పెషలు. వారికది తలగడుగుల రోజు. షీకాయతో అమ్మాయిల జుట్టుకి కాసేపు దోస్తీ కుదిరేది. ఆనక చిక్కులు తీసుకుంటూ ఇల్లంతా చుక్కల్లా తిరుగుతుండేవారు. ఆదివారం నాడు ఏం తినాలనేదీ ఒక పెద్ద చర్చే. సెలవు కాబట్టి పాఠోళీ చెయ్యమ్మా..పెద్దకొడుకు ఆర్డరేసేవాడు. పెసరట్ల కూర, చంద్రకాంతాల స్వీటు చేసి పెట్టవే.. చిన్నపిల్ల పెద్దకోరికే కోరేది. ఇప్పట్లోలా నాటి కాలాన హోటళ్లు లేవు. ఎవరేం తినాలన్నా అమ్మ చేతి వంటే.

ఇంతమందికీ కోరినవన్నీ హాయిగా వండిపెట్టినా తల్లిముఖాన చిన్నమెత్తు విసుగూ కనిపించేది కాదు. బామ్మ నుంచి మనవడి దాకా అందరూ కింద కూర్చునే ఏకబంతి తినేవారు. ఆదివారం భోజనాలు అంత మజాగా సాగేవి. తిళ్లయ్యాక అందరి దృష్టీ రేడియో మీదికి మళ్లేది. చిన్న కునుకు తీసిన నాన్న, బామ్మ కూడా రేడియో బల్ల ముందుకొచ్చేవారు.

సరిగ్గా మూడున్నర అయ్యేసరికి రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం దూసుకొచ్చేది. శబ్ద చిత్రం అయ్యేదాకా శబ్దం చేయని పిల్లకాయలు అది అయిందనగానే ఆకలి కేకలు పెట్టేవారు. జంతికలో, మురుకులో వారికి నైవేద్యం పెట్టి రాత్రి వంటకి అమ్మ నిప్పుచేయడం ఆరంభించేది. పెద్దన్న స్నేహితులతో కలిసి బంతాట మైదానానికి పోయేవాడు. చిన్నవాడు కోతికొమ్మచ్చంటూ అదృశ్యమైపోయేవాడు. ఆడపిల్లలు కుట్లో అల్లికలో చేసుకునేవారు.

ఇలా అంతా కలిసి ఆదివారాన్ని పండగలా చేసుకున్నాక నానమ్మ కథలు మొదలయ్యేవి. కాశీమజిలీ, బాలవర్థిరాజు, కాంభోజరాజు కథలు కళ్లకు కట్టినట్టు చెప్పేది. బుజ్జిగాళ్లంతా టెన్షన్‌గా వింటుండేవారు. పెద్దక్క, అన్న మాత్రం బామ్మగారి పాత స్క్రీన్‌ప్లే, సంభాషణలకు విసిగి వేసారి ముసుగుతన్నేవారు. అలా అంతా నిద్దరోయి లేచాక మరో వారంలోనే ఇంకో మంచి ఆదివారం చేతికందేది. అమృతంలాంటి ఆహ్లాదాన్ని పంచిపెట్టేది.

ఇలాంటి ఘనమైన సండేలను ఇప్పుడు ఊహించగలమా? డబ్బు వెనుక దౌడాయింపు మొదలెట్టాక ఈ కాలాన మనకేం మిగిలింది? బ్యాంకు నిండా బ్యాలెన్సులున్నా హృదయంలో ప్రశాంతత లేకుండా పోయింది. రవివారం మనకి తెలియకుండానే వస్తోంది... వెలుగులేవీ పంచకుండానే చప్పున చేజారిపోతోంది. లాభం లేదు! ఇకమీదట ఆదివారాలను ఒడిసి పట్టాల్సిందే! నా(మే)టి మధుర క్షణాలను స్వంతం చేసుకోవాల్సిందే!ఇక నో ఆలస్యం... ఆన్ యువర్ మార్క్.. సెట్.. గో..!

2 కామెంట్‌లు: