3, డిసెంబర్ 2011, శనివారం

జీవితం లో సంతోషం అంటే ఏమిటి ?(Nick Vujicic)

జీవితం లో సంతోషం అంటే ఏమిటి ?
ఈ వీడియో అన్ని వుండి, ఇంకా ఏదో కావలి అని ఏడిచే వాళ్ళకు

Nick Vujicic and his attitude serve as a great examples of the celebration of life over limitations.





   మరో వీడియో

                                 Life Without Limits | No Arms | No Limbs | No Worries

 
 
 
అందరికోసం పుట్టాడు

పాతికేళ్ల క్రితం... ఆస్ట్రేలియాలోని ఓ ఆసుపత్రిలో ఒక పడతి పురిటి నొప్పులు పడుతోంది. బయట ఆమె భర్త ఆందోళనగా, ఆతృతగా ఉన్నాడు. అదేసమయంలో మరికొన్ని క్షణాల్లో తాను తండ్రి కాబోతున్నానన్న ఆనందం అతడిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అరగంట గడిచింది. డాక్టర్ బయటకు వచ్చి మీ బాబును చూసుకోవచ్చు, అని చెప్పింది. ఎంత వేగంతో లోపలికి వెళ్లాడో, అంతే వేగంతో వాష్‌రూంలోకి వెళ్లాడు. ఆ పసికందును చూడగానే వాంతి చేసుకున్నాడా తండ్రి! ఏళ్లు గడిచాయి... ‘‘నిక్ వుజిసిక్ నా ముద్దుల కొడుకు!’’ తన బిడ్డను చూడగానే వాంతి చేసుకున్న తండ్రి ఇప్పుడు గర్వంగా చెప్తున్నాడు. ఎవరీ నిక్?


‘అమ్మా నాకు బతకాలని లేదమ్మా, చచ్చిపోతానమ్మా’ అని చిన్నారి తల్లిని అడుగుతుంటే... ఆ తల్లి గుండె తట్టుకోగలదా? కనిపెంచిన తల్లే కాదు, అసలు ఏ అమ్మ అయినా ఆ మాట వినగలదా! కాళ్లు లేవు, చేతులు లేవు. ఉదయం బ్రష్ చేసుకోవడం నుంచి రాత్రి పడుకునేటపుడు దుప్పటి కప్పుకోవాలన్నా కూడా మరొకరి సాయం అవసరం. అలాంటి జీవితం బతికితే ఎంత, బతక్కపోతే ఎంత అన్న ఆవేదన బాల్యంలోనే నిక్ వుజిసిక్ అనుభవించాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పుట్టిన అతను జీవితంలో కొన్ని వందల సార్లు చనిపోవాలనుకున్నాడు. తనకు పదమూడేళ్లపుడు ఒక పత్రికలో కనిపించిన వార్త అతడి ఆత్మహత్య ఆలోచనలను పూర్తిగా తుడిచిపెట్టేసింది.

‘ఒక అంగవికలుడు తను అనుకున్నది సాధించి, ఇతరులకు సాయం చేస్తున్నాడు’ అదీ ఆ వార్త సారాంశం. అప్పుడర్థమయింది దేవుడు ఉద్దేశపూర్వకంగా తనను ఇలా సృష్టించాడని. తన లాంటి వారిని ఇతరులకు స్ఫూర్తినివ్వడం కోసమే పుట్టిస్తాడని భావించడం మొదలుపెట్టాడు నిక్. అతడిలో మనో నిబ్బరం కాస్తామనోశక్తిగా మారింది. ఏదో ఒకటి చేయాలని ఉంది. కానీ, ఏం చేయాలి, అసలు ఏం చేయగలను అని ఆలోచించాడు. ఇన్నాళ్లు తను జీవిస్తున్నాడంటే దానికి కారణం అమ్మ, ఆమె చెప్పిన మాటలు! ఆ మాటలకున్న పవర్ అంతా ఇంతా కాదు! ‘అమ్మ నాలోని శక్తియుక్తులు ఉపయోగించడం నాకు నేర్పినట్లే, నేను ప్రపంచానికి నేర్పుతాను’ అనుకున్నాడు.

మాటే మంత్రం
సాంత్వనకైనా, ప్రోత్సాహానికైనా మాటే మంత్రం. తాను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. తన పాఠ్యాంశాల్లో రాణిస్తూనే నలుగురినీ పోగేసి లెక్చర్లు దంచడం ప్రారంభించాడు. తల్లిదండ్రుల సాయంతో ప్రపంచంలో గొప్ప వక్తల గురించి, వారి ప్రసంగాల గురించి తెలుసుకున్నాడు. ఒకప్పుడు భారమైన కొడుకు, భారాన్ని మోసేవాడయ్యాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరిగా నిలిచారు.

నేర్చుకోవడం నుంచి నేర్పడం వరకు
కాళ్లూ చేతుల్లేని నిక్‌కు కేవలం ఎడమవైపు మాత్రం చిన్న పాదం, దానికి రెండు వేళ్లు ఉంటాయి. వాటితో పెన్ను పట్టుకునే ఓ ప్లాస్టిక్ పరికరాన్ని తల్లి స్వయంగా తయారుచేసిచ్చింది. అతనిలో విశ్వాసాన్ని పెంచడానికి కొడుకును స్పెషల్ స్కూల్లో వేయకుండా సాధారణ పిల్లలు చదువుకునే బడికే పంపింది. అవమానాలు తప్పవని తెలిసినా ఆమె జంకలేదు. ఎప్పటికప్పుడు అతడిని ఓదారుస్తూ, స్ఫూర్తినిస్తూ పెంచింది.

నిక్ ఎన్నిసార్లు డిప్రెషన్‌లోకి పోయాడో లెక్కలేదు. అలా జరిగినపుడల్లా అమ్మ అతడిని మామూలు స్థితిలోకి తెచ్చేది. తండ్రి కూడా అంతే. ఐదేళ్ల వయసులోనే అతనికి ఈతనేర్పాడు. నిక్‌కు ఈత మాత్రమే కాదు, సముద్రంపై సర్ఫింగ్ చేయగలడు, గొంతు కింద గోల్ఫ్‌స్టిక్‌ను పెట్టుకుని బంతిని గురిచూసి కొట్టగలడు. అతడి కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన ఎలక్ట్రిక్ చైర్‌తో తనకు కావాల్సిన చోటుకు సొంతంగా వెళ్లిరాగలడు.

ఫైనాన్సియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్‌లో డిగ్రీ చేసిన నిక్ ఉద్యోగంపై ఆసక్తి చూపలేదు. మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. తూటాల్లాంటి తన మాటలతో అందరినీ మైమరిపించాడు. భావోద్వేగాలతో, ఆశ్చర్యగొలిపే మాటలతో కూడిన అతడి ప్రసంగం మన ఒంట్లో అగ్నికణాలను జ్వలింపచేస్తుంది. అతని చేతులు పట్టుకుని బంగారు భవిష్యత్తు వైపు మనల్ని తీసుకెళ్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఇప్పటివరకు నిక్ వుజుసిక్ తన ప్రసంగాలతో లక్షన్నర మందిలో స్ఫూర్తి నింపారు.

నోటితో మార్కర్ పట్టుకుని బోర్డుపై స్వయంగా రాస్తారు. సుమారు యాభై దేశాల్లో తన ప్రసంగాలిచ్చిన నిక్ 2008లో ఇండియా కూడా వచ్చారు. వివిధ దేశాల నాయకులు ఆయన ప్రసంగాలకు ముగ్దులయ్యారు. ఎంతో మంది పెద్దలు అతడి నుంచి స్ఫూర్తి పొందారు. వీటన్నింటి గురించి నిక్ మాట్లాడుతూ ‘మనుషులకు దేవుడిచ్చిన శక్తిసామర్థ్యాలు ఎంత గొప్పవో నిరూపించడానికే దేవుడు మాలాంటి వారిని పుట్టించాడు’ అంటాడెంతో గర్వంగా!

అసామాన్యమైన పనులు
నిక్ గురించి తెలియని వారికి ఆయన్ను చూస్తేనే జాలేస్తుంది. కానీ, అతని గురించి తెలుసుకున్నాక మనమీద మనకు జాలేస్తుంది. అతని పట్ల ఎవరైనా వింతగా చూసినా, ఇబ్బందికరమైన చూపులు చూసినా బాధపడరు. చమత్కారంగా తన విన్యాసాలతో సమాధానం చెబుతాడు. వికలురయిన పిల్లలుంటే తల్లిదండ్రులు ఏదో ఒక క్షణంలో తప్పకుండా బాధపడతారు.

వీరూ మొదట్లో అలా బాధపడ్డారు. కానీ, ఏరోజూ అతడిని జాలిగా చూడలేదు. సాధారణ వ్యక్తిలాగానే పెంచారు. సాధారణ బడికే పంపారు. అతనిలోని శక్తియుక్తులను మేల్కొలుపుతూ వచ్చారు. నిరంతరం అండగా నిలబడ్డారు. అందుకే చిన్నప్పటి నుంచి నిక్ తన సత్తా చాటుకున్నాడు. హ్యాట్సాఫ్ టు నిక్ పేరెంట్స్!

ప్రకాష్ చిమ్మల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి