27, జనవరి 2012, శుక్రవారం

గుర్తుచేసుకుందాం... ఇప్పుడైనా!


వీరులు, ధీరుల త్యాగఫలం మన రిపబ్లిక్!
ఈ గణతంత్ర వ్యవస్థలో నియంతలుండరు... రాజులుండరు... ప్రజలే ప్రభువులు!
ఠాకూర్ రోషన్ సింగ్ లాంటి ఎందరో ప్రజాఉద్యమకారులు అధికారాన్ని దేవిడీలనుంచి చేజిక్కించుకునే క్రమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆ వీరులను స్మరించుకోవడం మనందరి కనీస కర్తవ్యం...

18 నవంబర్ 1921.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరుగుతోంది. షాజహాన్‌పూర్ నుంచి బరేలీ వరకు 80 కిలోమీటర్ల మేర సాగుతున్న ఊరేగింపు అది. సుమారు వెయ్యిమంది స్వదేశీ వస్త్రధారులై సైనికుల్లా కదం తొక్కుతున్నారు. విదేశీ వస్తువుల్ని నడిరోడ్లపై కాల్చేస్తున్నారు. భారత్‌మాతా కీ జై అనే నినాదంతో భూమ్యాకాశాలు బద్దలైపోతున్నాయి. ఆ వందల మందినీ ఉత్తేజితుల్ని చేస్తూ, ముందుకు నడిపిస్తున్న నాయకుడు- 29 ఏళ్ల రోషన్‌సింగ్.

దేశం కోసం మరణించడానికే పుట్టానన్నట్లు ఉన్నాడు రోషన్. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యంత బలమైన ఠాకూర్ వంశంలో జన్మించాడు. చిన్నప్పటినుంచి భయం అంటే ఏమిటో తెలీకుండా పెరిగాడు. తుపాకీని గురిపెట్టి కాల్చడంలో అతడికి సాటి అతడే! కుస్తీ పట్టు పడితే భీమసేనుడైనా రోషన్ ముందు దిగదుడుపే!

ఎలాగైనా ఆ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలి. అదీ రోషన్ పట్టుదల. మార్గమధ్యంలో పదులమంది గ్రామస్థులు కూడా పదం కలిపేలా చేస్తున్నాడు రోషన్. ఎక్కడికక్కడ పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. అయినా జనసంద్రం సాగుతూనే ఉంది. ర్యాలీ ఇంకో పది నిమిషాల్లో బరేలీ చేరుతుందనగా పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్ చేశారు. రోషన్‌ని కోర్టులో హాజరుపరిచారు. బరేలీ జైలుకి తరలించారు- రెండేళ్ల కారాగారవాసానికి!

జైలు నుంచి విడుదలయ్యాక రోషన్‌లో మునుపటికన్నా ఆవేశం హెచ్చింది. నిరంతరం ఒకటే ధ్యాస- దేశానికి స్వతంత్రం రావాలి; బ్రిటిష్‌వారిని తరిమేయాలి. అంతే! కుంగిపోతున్న దేశమాతను తలచుకుని ఎన్ని కన్నీళ్లు కార్చాడో! గోమతీ నదీ తీరంలోనో, గోధుమ పంట చేలల్లోనో తిరుగుతూ మిత్రుడు హుకాంసింగ్‌కు తన ఆవేదన చెప్పుకునేవాడు. తల్లి భారతి కోసం ఉరికంబమైనా ఎక్కుతానని ఆవేశంగా అంటుండేవాడు. ‘‘పిచ్చిగా వాగకు. నీవొక్కడివి మరణిస్తే - స్వాతంత్య్రం వచ్చేస్తుందా?’’

విసుక్కునేవాడు హుకాం. ‘‘ఎవడికి వాడు ఇలాగే అనుకుంటే వస్తుందా?’’ ఎదురు ప్రశ్నించేవాడు రోషన్. ‘‘చూడు మిత్రమా! జంతువులు పుడతాయి కానీ తమకోసమే చస్తాయి. మనమూ అంతేనా?’’ సూటిగా అడిగేవాడు రోషన్. పెళ్లయి పిల్లలున్న రోషన్ కుటుంబం, ఆస్తిపాస్తులకోసం పడి చచ్చిపోకుండా దేశం కోసం చచ్చిపోవాలనుకోవడం హుకాంని కదిలించింది. ‘నీ కల నెరవేరాలంటే రాంప్రసాద్ బిస్మిల్‌ని కలవమని’ రోషన్‌కి సలహా ఇచ్చాడు హుకాం.

ఎవరీ బిస్మిల్?
5 ఏప్రిల్ 1924.
షాజహాన్ పూర్ ఆర్యసమాజ్.
రాంప్రసాద్ బిస్మిల్‌ని కలవడానికి వెళ్లాడు రోషన్‌సింగ్.

కండలు తిరిగిన దేహంతో మెలితిరిగిన మీసంతో యుద్ధ వీరుడిలా ఉన్నాడు బిస్మిల్. ఆ పక్కనే అష్ఫఖుల్లాఖాన్. ఇద్దరూ ప్రాణస్నేహితులు. అప్పటికి బిస్మిల్ వయసు 27, ఖాన్‌ది ఇరవై నాలుగే! సాధారణంగా అలాంటి నవయువకులు చేసే పని - అందమైన జీవితాన్ని స్వప్నించడం! కాని వారిద్దరూ దుర్మార్గుల చేతినుంచి దేశాన్ని ఎలా రక్షించాలా అని మధన పడుతున్నారు.

బిస్మిల్ చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవాడు. కాని ఆర్యసమాజ్‌లో చేరి స్వామి సోమ్‌దేవ్ శిష్యరికంతో గాడిలో పడ్డాడు. ఘోరమైన నియమాలతో బ్రహ్మచర్యం పాటించాడు. ఆవేశాన్ని రగిలించే దేశభక్తి కవితల్ని రచించాడు. అసలు బిస్మల్ అన్నది కలం పేరే! సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు అర్ధంతరంగా ఆపేశారంటూ ఏకంగా గాంధీనే నిలదీసిన ధీరుడు బిస్మిల్. అదీ పాతికేళ్ల వయసులో - బహిరంగంగా 1922 నాటి గయ కాంగ్రెస్ వేదికపై!

ఇక అష్ఫఖుల్లాఖాన్- అందగాడు. ఒడ్డూ పొడుగూ ఉన్నవాడు. బలిష్ఠంగా ఉండేవాడు. నరనరానా దేశభక్తి నింపుకున్నాడు. భారతదేశం బానిస ఖండం కావడం ఖాన్‌ని కలచి వేసింది. స్వరాజ్యం కోసం తానూ సమిధనవ్వాలనుకున్నాడు. బిస్మిల్‌తో స్నేహం చేస్తేనే ఇది సాకారమవుతుందని గ్రహించాడు. కానీ హైందవాన్ని బోధించే ఆర్యసమాజ సభ్యుడు... వేద సంస్కృతిని నిష్ఠతో పాటించే బ్రాహ్మణుడైన బిస్మిల్ తనను చేరదీస్తాడా అని తొలుత సందేహించాడు.

అది భ్రమ అని తర్వాత గ్రహించాడు. వారిద్దరిదీ ఎంత గాఢస్నేహమంటే- ఓసారి ఖాన్‌కి ఒళ్లు తెలీనంత జ్వరమొచ్చింది. రాత్రిళ్లు ‘‘రాం రాం’’ అంటూ పలవరించేవాడు. హిందువుల దైవాన్ని తమ బేటా కలవరించడంతో ఖాన్ తల్లిదండ్రులు పరేషానైపోయారు. కాని తర్వాత తెలిసింది అది ప్రాణమిత్రుడి పేరని!

అలాంటి ఆ ఇద్దరినీ కలిశాడు ఠాకూర్ రోషన్‌సింగ్.
‘‘ఏం కావాలి?’’ అడిగాడు బిస్మిల్.
‘‘భరతమాత కళ్లల్లో ఆనందం’’ అన్నాడు రోషన్.
‘‘ఏమిస్తావ్’’అడిగాడు అష్ఫఖుల్లాఖాన్.

‘‘నా రక్తాన్ని... ప్రాణాన్ని...’’ కసిగా పిడికిలిని ఛాతీపై గట్టిగా కొట్టుకుంటూ చెప్పాడు రోషన్.
అంతే! బలమైన కె రటం కొండను తాకినట్లు- ఒకేసారి రోషన్‌ని కౌగిలించుకున్నారు ఆ ఇద్దరూ!
కాని అప్పటికి ఆ ముగ్గురికీ తెలీదు- షాజహాన్‌పూర్‌లోనే 8 ఏళ్ల వ్యవధిలో పుట్టిన ఆ ముగ్గురూ సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఒకేరోజున ఒకేక్షణాన- వేర్వేరు జైళ్లల్లో- ఉరితీయబడతారని! తెలిసినా - వారు అలాగే తెగించి ఉండేవారు. ఎందుకంటే- వారు నేటికాలపు దొంగదేశభక్తులు కారు.
సంఘటిత శక్తిగా...

అక్టోబర్ 1924.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్.
స్వదేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే యువకులంతా సమావేశమయ్యారు. దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ బలిపీఠం ఎక్కడానికి తెగ ముచ్చటపడిపోతున్న యోధులు వారు. అలాంటి ఆ ఉడుకు రక్తధారల్ని సంఘటితం చేసి ‘హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్’(హెచ్‌ఆర్‌ఏ) ని స్థాపించారు రాంప్రసాద్ బిస్మిల్, సచిన్ సన్యాల్, చంద్రశేఖర్ ఆజాద్. పూర్తి భారతీయ విప్లవకారులతో ఏర్పడిన తొలి సామ్యవాద సమాజమది. రోషన్‌సింగ్, అష్ఫఖుల్లా ఖాన్ లాంటి ఎందరో వీరులు అందులో సభ్యులయ్యారు.

బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రత్యక్షదాడులకు దిగడం, సైనిక కుట్రలకు పాల్పడటం, విప్లవ సాహిత్య ప్రచారం, ఆయుధాల్ని, మందుగుండు సామగ్రిని సమకూర్చుకునేందుకు సర్కారు ఆయుధాగారాలపై, పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం... మరి ఇవన్నీ చేయడానికి డబ్బులు కావాలి కదా... కాబట్టి బ్రిటిష్ బ్యాంకుల్ని, సంపన్నుల్ని, ప్రభుత్వ ఖజానాని లూఠీచేసి నిధుల్ని సమీకరించడం- ఇవీ హెచ్‌ఆర్‌ఏ లక్ష్యాలు.
అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగిపోయారు బిస్మిల్ తదితరులు.
రైలుదోపిడీ!
9 ఆగస్టు 1925. రాత్రి ఏడయింది.

నవంబర్ 8 డౌన్ పేరుగల రైలు షాజన్‌పూర్ నుంచి లక్నోకి బయలుదేరింది. ఇంజిన్ వెనుక బోగీలో గార్డ్ ఉన్నాడు. ఆ వెనుక కళ్లు జిగేల్‌మనే నోట్ల కట్టలున్నాయి. ప్రజల్ని పీడించి పన్నుల రూపంలో వసూలు చేసిన సర్కారు సొమ్మది. పోలీసు పహారాలో ఉన్న ఆ డబ్బు మూటలకై మాటు వేసింది బిస్మిల్ సేన. ఏమీ ఎరుగని ప్రయాణికుల్లా రెలైక్కేశారు విప్లవకారులు.

రైలు కాకోరి స్టేషన్‌కి చేరింది. అంతే... ఒక్కసారిగా చెయిన్ లాగారు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, కేశవ చక్రవర్తి తదితర వీరులు పోలీసుల్ని చుట్టుముట్టారు. జర్మనీలో తయారైన మాసర్ సి 96 ఆటోమాటిక్ పిస్టళ్లతో దాడి చేశారు. డబ్బుని కాజేసి క్షణంలో చీకట్లో కలిసిపోయారు.

ఇది చిన్న ఘటనే. కాని బ్రిటిష్‌వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. దీన్ని ఉపేక్షిస్తే తెల్లారేసరికి ఇది వైరస్‌లా దేశమంతా పాకుతుందని తెల్లవారికి అర్థమైపోయింది. ఈ దోపిడీలో పాల్గొన్నది 10 మందే కాని సర్కారు ఏకంగా 40 మందిపై కేసు పెట్టింది. రెండునెలలు తిరక్కుండా దాదాపు అందర్నీ అరెస్టు చేసింది. ఒక్క చంద్రశేఖర్ ఆజాద్‌ని మాత్రం ప్రభుత్వం పట్టుకోలేకపోయింది.

వాస్తవానికి కేశవ్ చక్రవర్తిని కూడా పోలీసులు చేజిక్కించుకోలేకపోయారు. కాకపోతే- రోషన్‌సింగ్ అచ్చం కేశవ్ చక్రవర్తిలాగానే ఉండేవాడు. పైగా ఇద్దరి వయసూ దాదాపు ఒకటే. దాంతో రోషన్‌సింగ్‌ను కుట్రలో ఇరికించారు ఆంగ్లేయులు. వాస్తవానికి కాకోరి రైలు దోపిడీలో రోషన్ నేరుగా పాల్గొనలేదు. అయినా తనపై దొంగకేసు బనాయించినందుకు బాధపడలేదు. పైగా సంబరపడ్డాడు- మాతృదేశ రుణం తీర్చుకునే అవకాశం చిక్కినందుకు!

అలా అప్పుడు త్రుటిలో బయటపడ్డ కేశవ్ చక్రవర్తి అసలు పేరు- కేశవ్ బలిరాం హెగ్డేవార్. 1925లో నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) ని స్థాపించింది ఈయనే! రోషన్‌సింగ్ బలిదానం పుణ్యంగా - జాతీయ స్పృహకు అంకితమైన ఓ సంస్థ ఆవిర్భవించిందన్నమాట!
కాకోరి కుట్రకేసు విచారణ ఏడాదిన్నర సాగింది. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, రోషన్‌సింగ్, రాజేంద్రలాహిరి- ఈ నలుగురికీ మరణశిక్ష విధిస్తూ లక్నో కోర్టు తీర్పునిచ్చింది.

దీనిని వ్యతిరేకిస్తూ ఆసేతు హిమాచలం నిరసనలు వెల్లువెత్తాయి. మున్షీ ప్రేమ్‌చంద్‌లాంటి రచయితలు, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, మహ్మదాలీజిన్నా, మదన్ మోహన్ మాలవీయ లాంటి జాతీయ నాయకులు శిక్షను కనీసం యావజ్జీవంగానైనా మార్చమని బ్రిటిష్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అయినా శంఖమే అయింది. ఉరిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిస్మిల్‌ను గోరఖ్‌పూర్ జైలుకి, రోషన్‌సింగ్‌ని అలహాబాద్ జైలుకి, అష్ఫఖుల్లాఖాన్‌ని ఫజియాబాద్ జైలుకి, రాజేంద్ర లాహిరిని గోండా జైలుకి తరలించారు.

మరణమంటే భయపడని వారుంటారా? ఉంటారు... ఇదిగో ఈ నలుగురే! మరో ఇరవై రోజుల్లో తమకు ఉరి ఖాయమని తెలుసు. అయినా వారిలో కించిత్ బాధ లేదు. దేశం కోసం, తరతరాల భారతీయుల స్వేచ్ఛకోసం ... బలిపీఠం ఎక్కుతుంటే శోకం దేనికి? ఇదీ వారి అంతరంగం. మరణానికి ముందు హుకాంకి రాసిన ఉత్తరంలో ‘‘నేను ఉదాత్త ఆశయం కోసం మరణిస్తున్నాను. వద్దు... కన్నీరు కార్చొద్దు’’ అని అంటాడు రోషన్ సింగ్.

రాజేంద్ర లాహిరి చివరి రోజుల్లో ఉపనిషత్తుల్నీ వివేకానంద సూక్తుల్ని చదువుకుంటూ ఉత్సాహంగా గడిపేవాడు. బిస్మిల్ జైల్లోనే ఉండి తన ఆత్మ కథ ‘సర్ఫరోషీ కీ తమన్నా’ (దేశభక్తుడి కోరిక) రచించాడు. ఉరికి ముందురోజు ఉరకలేసే ఉత్సాహంతో తల్లితో సంభాషించాడు. ఇక అష్ఫఖుల్లాఖాన్ అయితే జైల్లో ఖుషీగా గడిపాడు. చావుకి ముందురోజు ఖాన్‌ని భగత్‌సింగ్ కలిసినప్పుడు ‘రేపే నా పెళ్లి’ అంటూ తుళ్లుతూ మాట్లాడాడు.

17 డిసెంబర్ 1927న రాజేంద్ర లాహిరినీ, 19న మిగిలిన ముగ్గురినీ ఉరితీశారు. భగవద్గీత వల్లెవేస్తూ బిస్మిల్, ఓంకార ప్రార్థన చేస్తూ రోషన్, అల్లాను ప్రార్థిస్తూ ఖాన్ బలిపీఠమెక్కారు. వందేమాతరం అంటూ బిగ్గరగా అరుస్తూ ఉరితాడుని ముద్దుపెట్టుకుని తుదిశ్వాస విడిచారంటే ... తల్లి భారతి అంటే వారికెంత పిచ్చి ప్రేమో తెలుస్తుంది.
అందులో వందోవంతు కూడా మనకు లేకపోతే - వారి త్యాగాలు వృథా! మన బతుకులు వృథాకు మించిన వృథా!!

సరిగ్గా నేటికి 120 ఏళ్ల కిందట- 1892 జనవరి 22న - ఠాకూర్ రోషన్‌సింగ్; ఆపై అయిదేళ్లకు 1897 జూన్ 11న రాంప్రసాద్ బిస్మిల్, ఆపై మూడేళ్లకి 1900 అక్టోబర్ 22న అష్ఫఖుల్లాఖాన్ జన్మించారు. ఈ ముగ్గురూ పుట్టింది ఒకేచోట... మరణించిందీ ఒకేరోజున! వీరికి రాజకీయ లౌక్యాలు, సైద్ధాంతిక చర్చలూ తెలీవు. తెలిసిందల్లా ... దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టడమే!

ఆకెళ్ల రాఘవేంద్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి