15, జనవరి 2012, ఆదివారం

ఉత్తమం స్వార్జితం విత్తం... స్త్రీవిత్తం అధమాధమమ్



మామగారు కన్యాదాత. అంటే దానం ఇచ్చే హోదాలో ఉన్నవారు. అల్లుడు దానం పుచ్చుకునే స్థితిలో ఉంటాడు. దాతగా మామగారికి ఆభిజాత్యం ఉండకూడదు. మామగారు తన కుమార్తెను ఆప్యాయంగా దానం చేయాలి. అల్లుడు మామగారిని తండ్రితో సమానంగా గౌరవించాలి. ఇక ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అన్నవి మామా అల్లుళ్లను బట్టి ఉంటుంది. మనుచరిత్రలో స్వరోచి, మనోరమల వివాహ సమయంలో స్వరోచి మామగారు స్వరోచికి విమానాన్ని బహుమానంగా ఇచ్చాడు.

అంటే అతని స్థాయిని బట్టి ఇచ్చాడే కాని, అల్లుడి ఒత్తిళ్లకు తల ఒగ్గి కాదు. అల్లుడు ఎప్పుడూ మామను ఒత్తిడి పెట్టకూడదు. మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అల్లుళ్లు అడిగిమరీ కట్నకానుకలు తీసుకునే ఆచారం లేదు. ఆంధ్రదేశంలో సంక్రాంతిని పెద్ద పండుగ అంటాం. మనది వ్యవసాయప్రధానమైన రాష్ట్రం కాబట్టి, పంటలు ఇంటికి వచ్చే సమయం కాబట్టి, అల్లుళ్లు ఈ సమయంలో కానుకలు అడగడానికి, ఇవ్వడానికి ఈ పండుగ ఒక సందర్భం అయ్యింది అంతే తప్ప మరేమీ కాదు. ‘‘ఉత్తమం స్వార్జితం విత్తం... స్త్రీవిత్తం అధమాధమమ్’’ అనే నీతి వాక్యం ప్రకారం చూసినా స్త్రీ నుంచి ధనం రావాలని ఆశించకూడదు. స్త్రీనుంచి ధనం ఆశించడం అంటే పరోక్షంగా మామగారిపై ఒత్తిడి తేవడమే. అల్లుడికిది తగని పని.

శివకేశవులంతటి వాళ్లే అడగలేదు!
శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో ఉంటాడు. శివుడు హిమాలయాల మీద నివసిస్తాడు. ఒకరకంగా వీరిరువురూ ఇల్లరికపుటల్లుళ్లే. అయితే శివ కేశవులిద్దరూ మామగారింట్లోనే ఉన్నప్పటికీ, వారిని ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదు, వారి నుంచి ఏనాడూ ఏమీ ఆశించలేదు.

పార్వతీదేవిని శివునికిచ్చి వివాహం చేయమని అడగడానికి ఋషులంతా కలిసి వెళ్లినప్పుడు మాత్రం, ఋషులలో ఒకరైన అంగీరసుడు, ‘‘శివుడికి ఇవ్వడం వలన కలిగే లాభాలు చెబుతూ... ఇంతవరకు ఈశ్వరుడు ఎవ్వరికీ నమస్కరించవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన కంటె పెద్దవాళ్లు లేరు. ఇప్పుడు నీకు సమస్కరిస్తాడు. ఈ సృష్టిలో నువ్వొక్కడివే ఈశ్వరుడితో నమస్కరించబడేవాడివి అవుతావు. మామగారు తండ్రితో సమానం అవుతారు. అందువలన పూజనీయుడు. మామగారిని గౌరవించడమనేది మన సంప్రదాయం’’ అని దక్షప్రజాపతికి చెప్పినట్లు ‘కుమారసంభవం’ లో కాళిదాసు వర్ణించాడు.

- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి