14, నవంబర్ 2011, సోమవారం

ఆ బస్సులో స్వార్థం పిచ్చికుక్కలా పరుగెట్టింది

ఆ బస్సులో స్వార్థం పిచ్చికుక్కలా పరుగెట్టింది

నిండు గర్భిణిలా మెల్లగా కదులుతూ బస్టాండ్‌లోంచి బయటపడిన నెల్లూరు - మద్రాసు ఎక్స్‌ప్రెస్ బస్సు మెల్ల మెల్లగా వేగాన్ని పుంజుకుంటూ మద్రాసు వైపు పరుగులు తీస్తోంది. "మద్రాసు వరకు ఎలాగైనా నిల్చుని వస్తాం. అర్జెంటు పనులున్నాయి. నన్ను ఎక్కించుకోండి ప్లీజ్." అంటూ మరీ బస్సెక్కారు నిల్చున్న ప్రతి ప్రయాణికుడు.

టిక్కెట్లు కొట్టే కార్యక్రమం ప్రారంభించాడు కండక్టర్. ఎక్కేంతవరకూ బతిమాలి ఎక్కిన ప్రయాణికులు, అన్ని గంటలపాటు ఇప్పుడెలా నిలబడాలా అని ఆలోచిస్తూ దిగులుగా నిలుచున్నారు. కూర్చుని ఉన్న ప్రయాణికులు మాత్రం సొంత జాగీరులా గర్వంగా కూర్చున్నారు. బస్సు లోపల చివరగా వెనుక ఉండే పెద్ద సీటులో పద్ధతి ప్రకారం ఐదుగురు విశాలంగా కూర్చున్నారు. ఆ కూర్చున్న వారిలో ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు.

వారు కొంచెం సర్దుకోగలిగితే ఇంకొకరు ఫ్రీగా కూర్చునే అవకాశం ఉంది. అది గమనించిన ఒక గర్భిణీ "ఏమండీ! మా పిల్లాడు... మద్రాసు వరకూ నిలబడి ప్రయాణించాలంటే వాడికి కాళ్లనొప్పులు పుడతాయేమో. కొద్దిగా సర్దుకొని వాడిని కూర్చోపెట్టుకోండి" అంటూ ప్రాధేయపడింది. మనల్ని కాదులే అన్నట్లు మొహం తిప్పుకున్నారు పిల్లలు కలిగిన ముగ్గురు తల్లులూను.

వారిలో ఏ ఒక్కరైనా ఆ పిల్లవాడిని ఒడిలోనైనా కూర్చోపెట్టుకోవచ్చు. అయినా మొహాలు తిప్పుకున్నారు. ఆ సీటు పర్మనెంట్‌గా తమదే అయినట్లుగా ఫీలయిపోతున్న మిగిలిన ఇద్దరు మగ మహారాజులు "ఈ సీట్లో కూర్చోవలసింది అయిదుగురేనమ్మా!" కొంచెం విసుగ్గా అన్నారు. కూర్చోవలసింది అయిదుగురే కానీ పిల్లాడు నిలబడలేడేమోనని మళ్ళీ ప్రాధేయపడిందా తల్లి. అదీ తన స్వార్థం కోసం కాదు. కేవలం కొడుకు కోసం ప్రాధేయపడింది.

"పిల్లాడు నిలబడలేడని తెలిసినప్పుడు బస్సెక్కకూడదమ్మా! తరువాతి బస్సులో రావలసింది" సమాధానమిచ్చాడు ఇంకో మగమహారాజు. "ఎక్కేటప్పుడు సీట్లు లేవని తెలిసినా ఎక్కేస్తారు. తర్వాత కూర్చున్న వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు. ఛ! ఛ!" విసుక్కున్నాడు ఇంకోఆయన. టిక్కెట్లు కొడుతూ వారి సంభాషణను విన్న కండెక్టర్ విననట్టే "ఏమిటమ్మా?" అంటూ ఆమెని ప్రశ్నించాడు.

కండక్టర్ వైపు దీనంగా చూస్తూ అతడే ఈ బస్సుకు సర్వాధికారి, తప్పక ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించి పిల్లాడికి సీటు ఇప్పించగలడని సమస్యను అతడితో మొరపెట్టుకుందా పిచ్చితల్లి. ఆమె వైపు పరిశీలనగా చూసిన కండక్టర్ ఆమెనో గర్భిణీ స్త్రీగా గుర్తించాడు. "సాటి ఆడవారి కోసం మీరైనా సర్దుకోకపోతే ఎలాగమ్మా? కొద్దిగా సర్దుకోండి" అంటూ కూర్చున్న ఆడవారినుద్దేశించి చెప్పాడు.

"ఏమయ్యా ఇది ఎంతమంది కూర్చునే సీటనుకుంటున్నావ్?" అంటూ ఎగిరిపడుతూ ప్రశ్నించారు సీట్లో ఉన్నవారంతా ముక్తకంఠంతో. మీ ఇష్టం నాకెందుకు అన్నట్లుగా వారికి సమాధానం చెప్పకుండా టికెట్లు కొట్టే కార్యక్రమంలో మునిగిపోయాడు కండక్టర్. బస్సులోపలి సమస్యలతో తనకేమీ సంబంధం లేనట్లు నేషనల్ హైవే మీద వేగంగా పరుగెడుతోందా ఎక్స్‌ప్రెస్ బస్సు.

"ఎక్కేటప్పుడు ఎలాగైనా నిలబడతాం అని కండక్టర్‌ని బ్రతిమాలి మరీ ఎక్కుతారు. తీరా ఎక్కాక ఇంతే! మనం కనుక సర్దుకొని ఉంటే మద్రాసు వెళ్ళేటప్పటికి నలిగి పిప్పి అయిపోతాం... తెలుసా? ఆ నిజం తెలుసు కాబట్టే సర్దుకోలేదు" అని లోగొంతుతో పక్కన కూర్చుని ఉన్న ఆడవారితో చెప్పాడో మగమహారాజు.

నిల్చుని ఉన్న వాళ్ళు వాళ్ళ మాటల్ని వింటున్నారే తప్ప ఎవ్వరూ సర్దుకోమని చెప్పలేదు. కనీసం చిన్న పిల్లవాడినైనా కూర్చోపెట్టుకోమని చెప్పడం కానీ జరగలేదు. నిల్చున్న కొందరు నిల్చునే నిద్రపోతూ ఉన్నారు. బస్సు కుదుపులకు అప్పుడప్పుడూ ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తున్నారు. కొంతమంది నిల్చుని అనర్గళంగా రాజకీయాల్ని గురించి చర్చిస్తూ పక్కవారికి పరమ బోర్ కొట్టిస్తున్నారు.

"ఈ బస్సుల్లో ప్రయాణం అంటేనే పరమ బోర్ గురూ! ఎంచక్కా లగ్జరీ బస్సు ఎక్కాల్సింది" అంటూ పక్కనున్న ప్రయాణికుడితో మొరపెట్టుకుంటున్నాడు ఓ యువకుడు. కండక్టర్ సీటు పక్కన నిల్చుని ఉన్న నాని వెనుక జరుగుతున్న సంభాషణను జాగ్రత్తగా వింటూ ఎవరైనా సర్దుకుంటారేమోనని చూస్తున్నాడు. వాళ్ళలో అలాంటి ఉద్దేశం లేకపోయేసరికి నిల్చున్న ప్రయాణికుల్ని తోసుకుంటూ వెనుక సీటు వద్దకు వెళ్లాడు.

అక్కడ గర్భిణీ స్త్రీ తన కుమారునితోపాటు నానా అవస్థలు పడుతూ నిలబడి ఉంది. "ఆడవారు మీరైనా సర్దుకుని ఆ పిల్లవాడిని కూర్చోపెట్టుకోవచ్చు కదా? వెనక సీట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరుగురు కూర్చోవచ్చు" సీట్లో కూర్చున్న ఆడవారిని చూస్తూ వాళ్ళనుద్దేశించి చెప్పాడు నాని.
" ఈ సీట్లో ఎంతమంది కూర్చోవాలో నీకు తెలుసా?". అన్నాడొకాయన
"అయిదుగురే కూర్చోవాలని తెలియదు కాబోలు పాపం!" వ్యంగ్యంగా ఇంకొకాయన అన్నాడు.

నానికి వాళ్ళ మాటలు ఎంతో కోపం తెప్పించాయి. "అవును ఐదుగురే కూర్చోవాలి. కానీ ఎలాగో తెలుసా? మీలా కాళ్ళు చాపుకుని కాదు. మీ ముందున్న ముగ్గురు కూర్చునే సీటు వెనుక ముగ్గురు కూర్చోవాలి. ఇద్దరు కూర్చునే సీటు వెనుక ఇద్దరే కూర్చోవాలి. అంతేకానీ పెళ్ళి భోజనాల బంతిలో కూర్చున్నట్లు కూర్చోకూడదు. సర్దుకోండి.. సర్దుకోండి" అంటూ కొంచెం గట్టిగా దబాయించాడు నాని. అయినా వారిలో ఏమాత్రం చలనం రాలేదు.

ముందున్న యువకుడొకడు నానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని సర్దుకోమని దబాయించాడు. మళ్ళీ ఇంకో ఇద్దరు. తర్వాత ముగ్గురు, అలా దాదాపు ఓ ఇరవైమంది నానిని సపోర్ట్ చేశారు. సీట్లో కూర్చున్న మగవాళ్లిద్దరూ కొద్దిగా భయపడినట్లు వారి ముఖ కవళికల్ని బట్టి తెలుస్తోంది. ఇంత గొడవ జరుగుతున్నా ఆర్టీసీ బస్సు ఆగకుండా పోతూనే ఉంది. సమస్యల్లోంచే నాయకుడు పుడతాడు.

ప్రస్తుతం బస్సులోని సమస్యను లాజిక్‌గా ధైర్యంగా ఎదుర్కొని నిల్చున్న తోటి ప్రయాణికుల సపోర్టుతో చిన్న సైజు నాయకుడైపోయాడా బస్సులో నాని. నిల్చున్న వారి సపోర్ట్‌తో మళ్ళీ సర్దుకోమని వాళ్ళను దబాయించాడు నాని. కూర్చున్నవారిలో ముగ్గురు స్త్రీలు కుడివైపుకి, ఇద్దరు పురుషులు ఎడమవైపుకి సర్దుకున్నారు.

దాంతో సీటు మధ్యలో చిన్నపిల్లాడేం కర్మ పెద్దవారే విశాలంగా కూర్చునేంత ఖాళీ ఏర్పడింది. నానీని అందరూ మెచ్చుకోలుగా చూశారు. తన బాధను అర్థం చేసుకుని తనకు సహాయం చేయవచ్చిన అతడి వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసిందా యువతి. "రా బాబు! కూర్చుందాం" అని పిల్లవాడిని పిలిచి కూర్చోబోయిందా పిచ్చితల్లి. ఇంతలో చుట్టుప్రక్కల ప్రయాణికుల వైపోసారి చూస్తూ మెల్లగా పిల్లాడితో సీట్లో గబుక్కున కూర్చున్నాడు నాని. దీంతో నిర్ఘాంతపోతూ చూసిందా యువతి.

బస్సు వేగంగా పోతూనే ఉంది. బస్సు వేగానికి చల్లటి గాలి బస్సులోకి ప్రవేశిస్తోంది. హాయిగా సీట్లో కూర్చున్న నాని కనురెప్పలు చల్లటి గాలికి బరువెక్కసాగాయి. ఆ గర్భిణి మాత్రం అలా నిల్చునే ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి