23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఒక్కేసి పువ్వేసి సందమామ... సల్లంగ బతుకమ్మ


ఒక్కేసి పువ్వేసి సందమామ... సల్లంగ బతుకమ్మ
‘ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాము ఆయే సందమామ..’ పాటలో బతుకమ్మ.
‘శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ.. చిత్రమై పోదురమ్మా గౌరమ్మా..’ భక్తిలో బతుకమ్మ.
రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ.బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ.ఆ అమ్మను కనులారా చూసుకొని, కమనీయంగా పాడుకొని,సిరిసంపదలు, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుకునే అతివలకు కొంగుబంగారం బతుకమ్మ.

బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్దపండుగ. జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో, పూలు బాగా వికసించే కాలంలో బతుకమ్మ వచ్చి, భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సుసంపన్నం చేస్తుంది. భాద్రపద బహుళ అమావాస్య రోజున బతుకమ్మ నట్టింటిలో కొంగొత్తగా సింగారించుకుంటుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవరాత్రుల వరకూ వాడవాడలా సంబరాల సడి చేస్తుంది. 

పూలతేరు
ఈ మాసంలో... తంగేడు, గునుగు, గుమ్మడి బంతి, చామంతి, సీతజడ, గోరింట.. ఇలా అనేక రకాల రంగు రంగుల పూలు ఆరుబయళ్లలో పూసిబతుకమ్మను సింగారించడానికి సిద్ధంగా ఉంటాయి. వారం రోజులు చిన్న బతుకమ్మలను చేసినా చివరి రోజు మాత్రం బతుకమ్మలను పెద్దగా పేర్చడానికి మహిళలు పోటీపడతారు. ఇందులో మగవారూ పాలుపంచుకుంటారు. 

ఆరోగ్య మాత
మన పూర్వీకులు పాటించిన ఆచారవ్యవహారాలకు, మన పండగలకు, వాతావరణ మార్పులకు అవినాభావ సంబంధం ఉందని తెలిపే ఈ పండగ విశిష్టత ఇంత అంత అని చెప్పలేం. ఆశ్వయజ మాసంలో వాతావరణ మార్పుల వల్ల ఎవరైనా తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి... వంటి అనేకరకాల పువ్వులను పేర్చి, పైన పసుపు గౌరమ్మను పెడతారు. ఈ పువ్వులు, పసుపు నుంచి వచ్చే ఔషధగుణాలుకల సువాసనల వలన అనేకరోగాలు నివారింపబడతాయనే నిగూఢతను తెలియజేస్తుంది బతుకమ్మ. 

సామాజిక స్నేహమయి
బతకుమ్మ పండగ వచ్చిందంటే ఆడపడుచులు పుట్టిళ్లకు చేరతారు. ఎక్కడెక్కడి తరుణీమణులు సాయంకాలం ఒకచోట చేరి, బతుకమ్మల చుట్టూ ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవనిపిస్తుంది. అందరూ ఒకచోట చేరి కష్టసుఖాలను పంచుకుంటారు. బతుకమ్మ పండగ మొదలైన తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు. పల్లీలు, నువ్వులు, జొన్నలు, సజ్జలు, బియ్యం, బెల్లం, చక్కెరలతో రకరకాల పిండి వంటలు తయారుచేస్తారు. వీటిని చద్దిమూటలుగా కట్టుకుని బతుకమ్మ ఆటలు పూర్తయ్యాక అందరూ కలిసి పాటలు పాడుతూ పంచుకొని తింటారు. అందరినీ ఒకచోట చేర్చి కలిసిమెలిసి ఉండటంలోని భరోసాని బతుకమ్మ చెప్పకనే తెలియజేస్తుంది. 

అనుభవాలే పాటలు
బతుకమ్మ పండగ పాటల్లో సాహిత్యాన్ని ఏ రచయితా రాసినది కాదు. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్ల నుంచి, అనుభవాల నుంచి ఉద్భవించినదే. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి తమ జీవితాలను ఎలా చక్కదిద్దుకోవాలనే విషయాలే బతుకమ్మ పాటలుగా రూపొందాయి. 
‘రామ రామ రామ ఉయ్యాలో.. 
రామనే శ్రీరామ ఉయ్యాలో.. 
అయ్యయ్యో రామా ఉయ్యాలో..
హరి బ్రహ్మదేవ ఉయ్యాలో’... అంటూ పురాణ, ఇతిహాసాలు బతుకమ్మ పాటల్లో ఊపిరిపోసుకున్నాయి. పామరులకు సైతం ఆ కథల్లోని అంతరార్థం ఇట్టే తెలియజెప్పుతుంది బతుకమ్మ. సీత, సావిత్రి, ద్రౌపది, అనసూయ, సుమతి, సావిత్రి.. వంటి ఎందరో మహిళామణుల గుణసంపన్నతలు తరతరాలకు అందించే వారధి అవుతుంది బతుకమ్మ.

పసుపు గౌరమ్మ
ఉదయాన్నే లేచి ఇల్లువాకిలి శుభ్రం చేసుకోవాలి. అభ్యంగస్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి, చెట్ల నుంచి కోసితెచ్చిన పూలతో చిన్న బతుకమ్మను అందంగా పేర్చి దేవుడి ముందు పెట్టాలి. పసుపుతో చిన్నగౌరమ్మను, పెద్ద గౌరమ్మను చేసి పూజించాలి. ఆ తర్వాత... పసుపు, కుంకుమలు, అక్షింతలతో బతుకమ్మను పూజించి, నైవేద్యం పెట్టాలి. మధ్యాహ్నం పెద్ద బతుకమ్మను పేర్చి చిన్న బతుకమ్మ పక్కన ఉంచాలి. సాయంకాలం శుచి అయి బతుకమ్మలకు పూజ చేయాలి. శుభ్రం చేసిన వాకిట్లో పీట వేసి చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మలను పెట్టి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో’- అంటూ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ పూజించాలి. ఆ తర్వాత ఊరిలోని బతుకమ్మలన్నిటినీ ఒక్కచోట పెట్టి మహిళలందరూ పాటలు పాడుతూ పూజించాలి. ఆడటం పూర్తయ్యాక చిన్నగౌరమ్మను కొద్దిపాటి నీటిలో సాగనంపుతూ ‘పోయిరా మాయమ్మ పోయిరావమ్మా, పోయి నీ అత్తింటనూ సుఖముంగా నుండు’ అంటూ అప్పగింత పాటలతో ఓలలాడించాలి. తొమ్మిదోరోజు పెద్ద గౌరమ్మను కూడా బతుకమ్మ మీద ఉంచి కొత్తవస్త్రంలో (చిన్నది) కొన్ని బియ్యం, ఒక్కరూపాయి, కొత్త రవిక బట్ట పెట్టి ముడివేయాలి. పూజా పూర్తి చేసి, ఏదైనా చెరువులో నిమజ్జనం చేయాలి. 

స్త్రీలు సున్నిత మనస్కులు. అందుకే వారిని పువ్వులతో పోలుస్తారు. వారి జీవితాలు కూడా పూవుల్లాగే సుగంధాలు వెదజల్లాలని, వారి కుటుంబాలు సంతోషమయం కావాలనే ఉద్దేశంతో, ‘చల్లగా బతుకమ్మా!’ అని ఆశీర్వదిస్తూ చేస్తారు ఈ వేడుకలు. వీటిని నవరాత్రుల సమయంలోనే చేయటంలో మరో అర్థం ఏమిటంటే ‘స్త్రీ పువ్వులా సుకుమారంగా ఉండటమే కాదు, అవసరమైతే ఆదిశక్తిలా దుష్టులను దునుమాడాలి, ఆపద సమయంలో శక్తియుక్తులు ప్రదర్శించి విజయం సాధించాలి’ అనే అంతరార్థం కూడా ఈ పండుగలో మిళితమై ఉంది.

- నిర్మలారెడ్డి

ప్రాచుర్యంలో ఉన్న కథ
పూర్వం చోళదేశాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య సత్యవతి. వారికి నూరుగురు కుమారులు ఉండేవారు. ఒకసారి యుద్ధంలో నూరుగురు కుమారులూ మరణించడంతో పాటు రాజ్యం, సంపద అంతా పోతుంది. ధర్మాంగుడు, అతని భార్య దుఃఖసాగరంలో మునిగిపోయారు. సత్యవతి లక్ష్మీదేవి కోసం ఘోర తపస్సు చేసింది. ఆ తల్లి ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అందుకు సత్యవతి లక్ష్మిదేవిని తన గర్భంలో చేరి, జన్మించమని కోరింది. శ్రీలక్ష్మి ఆమె గర్భాన జన్మించింది. మునులందరూ ఆ బిడ్డను చూడటానికి వచ్చి ‘బతుకమ్మ’ అని పిలిచారు. ‘బతకుమ్మ స్త్రీలలోకెల్లా మణిరత్నం వంటిది. మీ వంశానికి కీర్తి ప్రతిష్ఠలు తెస్తుంది, తన సంతానంతో నీ రాజ్యాన్ని సుసంపన్నం చేస్తుంది, ఈ తల్లిని కొలిచిన వారికి ఎన్నో సౌభాగ్యాలను ఇస్తుంది’ అని ధర్మాంగుడికి చెప్పారు. మునులు పిలిచిన ఆ పేరే బిడ్డకు ఖాయం చేశారు. శ్రీ మహావిష్ణువు చక్రాంగుడనే పేర జన్మనెత్తి ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. అతన్ని బతుకమ్మ పెళ్లి చేసుకోగా వారికి ఆరువేల మంది సుందరాంగులు జన్మించారు. ఆ ఆరువేల మంది సంతానమే నరజాతిని సుసంపన్నం చేసిందట. ధన, కనక, సంతాన, సౌభాగ్యాలతో విలసిల్లిన ఆ తల్లిని పూజించిన వారికి ఐదవతనం, సంతానసాఫల్యం, ఎనలేని సంపదలు కల్గుతాయి. ఈ కథ బతుకమ్మ పాటల ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందింది. 

రమ్యమైన బతుకమ్మ
రాగి లేదా ఇత్తడి పళ్లెం(తాంబాలం)లో వెడల్పాటి ఆకులు వేసి, పూలను వలయాకారంగా పేరుస్తారు. ముందుగా తంగేడు పూలు, ఆ పైన పసుపు కుంకుమలు అద్దిన గునుగు, ఆ పైన బంతి, చామంతి, గోరింట, సీతజడ... ఇలా రకరకాల పూలను చూడ చక్కగా అమర్చి రంగురంగుల బతుకమ్మను రమ్యంగా తీర్చిదిద్దుతారు.