15, ఆగస్టు 2011, సోమవారం

ఉప్పుయోగాలు 14 వేలు


ఉప్పుయోగాలు 14 వేలు

'ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా' అంటే ఏమని? ఉప్పు పుట్టాకే రుచి పుట్టిందని. అంతటి రుచిమంతురాలు ఉప్పు. అయినా ఉప్పు ప్రాధాన్యం తెలియని వారెవరు చెప్పండి? చేదుని తుంచి వేసేది, పులుపుని కోసివేసేది, తీపిని పెంచేది, వగరుని, కారాన్ని తీసి వేసేది ఉప్పదనమే. షడ్రుచులలో మరే రుచికీ మిగతా రుచుల్ని నియంత్రించే సీన్ లేదు. అందుకే రుచుల్లో రారాజు ఉప్పే. ఏది అప్పిచ్చినా ఉప్పు మాత్రం అప్పు ఇవ్వకూడదని అంటారంటే.. ఉప్పు అంత విలువైందని మరి. ఐదారు రూపాయలకే కిలో ఉప్పు వస్తున్నప్పుడు మరి అంత విలువేముంది దానికి అనుకుంటున్నారా..! ఇప్పుడంటే విరివిగా దొరకడం వల్ల 'విలువ' తగ్గినా ఒకప్పుడు ఉప్పుని బంగారంతో సమానంగా చూసేవారు.

ఎందుకంటే.. ఉప్పు మానవ నాగరికతకి పునాది వేసింది. ఉప్పు రాజ్యాల్ని ఏర్పరచింది.. వాటిని కూల్చేసింది. దాని వెనక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఉప్పు ఎన్ని గొప్పలైనా పోతుంది. ఈ రోజుల్లో అయితే మంచు ఎక్కువగా కురిసే దేశాల్లో ఉప్పు లేకపోతే రోడ్ల మీద ఎక్కడి మంచు అక్కడే ఉండిపోతుంది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోతాయి. అంతేనా..! మనం ఉపయోగించే వేల రకాల వస్తువుల తయారీకి ముడిసరుకు ఉప్పే. ఇలా చెప్పుకుంటూపోతే ఉప్పు ఉపయోగాలు 14 వేలవుతాయి. ఇన్ని రకాలుగా మానవునికి ఉపయోగపడుతున్న ఉప్పుగొప్పలే ఈ స్టోరీ.

పసిపిల్లాడు కూడా తినేదాంట్లో ఉప్పు తక్కువైతే 'అస్సలు బాగోలా' అన్నట్టు మొహం పక్కకు తిప్పుకుంటాడు. నోట్లో పెట్టిన దాన్ని ఊసేస్తూ విచిత్రంగా చూస్తాడు. అలా మొదలవుతుంది మనకీ ఉప్పుకీ సంబంధం.. తీపి, పులుపులు తిన్నట్టు ఉప్పు తినలేం. తీపి తక్కువగా ఉన్నా స్వీట్‌లు తినేస్తాం. పులుపు తక్కువైనా ఎలాగో ఎడ్జస్ట్ అయిపోతాం. చేదు, వగరు తక్కువైతే మరీ మంచిది అనుకుంటాం. అదే ఉప్పులేని చప్పిడి తిండి తినడమంటేనో! ఆ తిండి తినడం ఎంత కష్టమో పచ్చకామెర్లు వచ్చి పథ్యం చేసేవాళ్లని అడిగితే చెబుతారు. అలాగని ఉప్పు ఎక్కువైనా తంటాయే. మిగతా రుచుల్ని ఉప్పు నియంత్రించగలదు కాని ఉప్పదనాన్ని తగ్గించాలంటేనో..! ఆ పనిని రంగూ రుచీ వాసనా లేని నీరు చేయగలదేమో కాని మిగతా ఏది కలిపినా దాని ప్రభావాన్ని తగ్గించలేదు. అదీ ఉప్పుకున్న స్పెషల్ క్వాలిటీ.

లేచిన దగ్గర్నుంచీ..
పొద్దున్నే లేవగానే గొంతులో గరగరగా ఉంది, ఏదో అడ్డం పడ్డట్టు అనిపించింది.. వేడి చేసిందేమో.. ఏం చేస్తాం? కారణాలు వెతక్కుండా ముందు గొంతు పని చూడాలనుకుంటాం... వెంటనే ఓ గ్లాసుడు నీళ్లు వేడి చేసుకుని, స్పూన్ ఉప్పు దాంట్లో కలిపి ఆ నీళ్లతో గొంతు బాగా కడిగి పడేస్తాం. ఇది మనవాళ్లే కాదు.. ప్రపంచమంతటా అందరూ చేసే పనే. టీవీల్లో వచ్చే ఓ టూత్‌పేస్ట్ ప్రకటన చూసే ఉంటారు. మైక్ చేత పట్టిన ఓ యువతి (టీవీ రిపోర్టర్ లెండి) అమాంతం తలుపులు తోసుకుంటూ ఓ ఇంట్లోకి చొరబడుతుంది.. బ్రష్ చేసుకుంటున్న యువకుడి ముఖం ముందు మైక్ పెట్టి 'మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా..!' అనే ప్రశ్నని సంధిస్తుంది. 

ఆ యువకుడేమో తెల్ల మొహం వేసి...ఏమో! అన్నట్టు నోరు తెరిచి, అలా గుడ్లప్పగించి చూస్తాడు. నిజమే టూత్ పేస్ట్‌లో ఉప్పు కీలకం. ఉప్పుకి బేకింగ్ సోడా కలిపితే పండ్ల పొడి తయారైపోతుంది. ఉప్పు, బొగ్గు కలిపి పొడి చేసి పండ్లపొడిగా వాడే వాళ్లూ ఉన్నారు. అంతెందుకు... కళ్లు పుసి కట్టినా, నీళ్లు కారుతున్నా ఉప్పునీళ్లతో కడిగితే తగ్గిపోతుంది. శరీరంపై గాయాల్ని కూడా ఉప్పునీళ్లతో కడగమంటారు. ఉప్పుతో ఫేస్ మసాజ్ చేస్తే డెడ్ స్కిన్(మృత కణాలు) తొలగిపోతుంది. ఇవన్నీ నిజమేనా అనే డౌట్ మీకొస్తే.. ఒక్కసారి 'సాల్ట్ ఇనిస్టిట్యూట్' వెబ్‌సైట్‌కి వెళ్లి చదువుకోవచ్చు. ఇవన్నీ వాళ్లు చెబుతున్నవే. ఇలాంటి ఉపయోగాలు మొత్తం రాస్తే.. జస్ట్ ఓ పద్నాలుగు వేలొస్తాయి. ఇన్ని ఉపయోగాలున్న ఉప్పు గొప్పది కాక మరేంటి..?

పంటపొలాల్లో నుంచి వంటింటిదాకా
మనకే కాదు.. మొక్కలు, చెట్లు, జంతువులకు కూడా ఉప్పు కావాలి. కొబ్బరి పాదులకి ఉప్పేసి పెంచుతారు. ఎంతయినా సముద్ర తీరాల్లో పుట్టిన చెట్లు కదా.. వాటికీ ఉప్పునీటికీ ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. కొబ్బరి చెట్లకి తెగుళ్లు రాకుండా ఉండడానికి మొవ్వల్లో ఉప్పు చల్లుతారు. వంగతోటతోపాటు మొక్కజొన్న, గోధుమ పొలాలకి కూడా సోడియం క్లోరైడ్‌ని ఎరువుగా వాడతారు. మన విషయానికే వస్తే.. మనం తినే తిండి ద్వారా శరీరంలోకి ఉప్పొచ్చి చేరుతున్నా మనకి కావాల్సిన దాంతో పోలిస్తే అది చాలా చాలా తక్కువ. అందుకే ఉప్పు తినక తప్పదు. ఎక్కువగా ఉప్పు మనం పెరుగన్నం మజ్జిగన్నంలో వేసుకుంటాం.. కూరలు, పచ్చళ్లు, స్వీటు హాటు, ఐస్‌క్రీమ్.. ఇలా తినే ప్రతి దాంట్లోనూ వండేటప్పుడే కలిపేసి.. టేస్టీ వంటల్ని రెడీ చేసుకుంటాం.

ఇదంతా తెలిసిందే. నిజానికి ఉప్పు మరో పని కూడా చేస్తుంది. వంటలకి మంచి రుచిని తీసుకురావడమే కాదు.. వాటిని చకచకా ఉడికేలా చేస్తుంది ఉప్పు. ఎలాగంటే.. నీటిలో ఉప్పు వేయడం వల్ల ఆ నీరు ఉష్ణోగ్రత సున్నాకంటే తగ్గినా గడ్డ కట్టకుండా ఉండడమే కాదు.. ఉప్పు కలిపిన నీరు 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఆవిరైపోదు.. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా నీరుగానే మరుగుతూ ఉంటుంది.. వంద డిగ్రీల వద్ద ఉడికే కూర 105 డిగ్రీల వద్ద ఉడికితే తొందరగా ఉడుకుతుందిగా.. అందుకే వంట చేసేటప్పుడు ఉప్పు వల్ల వంటలు త్వరగా ఉడుకుతాయి. టైము, గ్యాసు రెండూ సేవ్ అవుతాయి. ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి.

ఉప్పుతో ఊరేస్తారు
'మీ ఉప్పు తిన్నవాణ్ణి...' అంటారు కాని 'మీరు పెట్టిన తిండి తిన్నవాణ్ణి' అనరు. 'నా ఉప్పు తిని నన్నే మోసం చేస్తావా..!' డైలాగ్ పాత సినిమాల్లో ఎంత ఫేమస్సో 'ఉప్పు పాతరేస్తా..!, 'ఉప్పులో ఊరేస్తా..!' లాంటి డైలాగ్‌లు కూడా అంతే ఫేమస్. ఉప్పు లేకపోయినట్లయితే మనం ఊరగాయలు పెట్టుకునే వాళ్లం కాదు.. అమెరికాలో ఉన్న మన వాళ్లకి పంపించగలిగే వాళ్లమూ కాదు. సూపర్ మార్కెట్ల నిండా పచ్చళ్ల బాటిళ్లు మనకి దర్శనమిచ్చేవి కాదు. 'ఉప్పుచేప' అనే పదమే తెలుగులో ఉండేది కాదు. 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని చెప్పడానికి వేమన రాసిన 'ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు..' అనే పద్యమూ ఉండేది కాదు.

'పప్పుచారు, ఉప్పుచేప'ల కాంబినేషన్ ఎంత టేస్టీగా ఉంటుందో మనకు తెలిసేదే కాదు. ఇప్పుడంటే రిఫ్రిజరేటర్లు, డీప్ ఫ్రీజర్లు, కోల్డ్ స్టోరేజిలు వచ్చేశాయి... ఒకప్పుడు మాత్రం దేన్ని నిల్వ ఉంచాలన్నా ఉప్పు పాతరేయడమే. అందుకే అంటారు.. ఉప్పు కనుగొనడం మానవ నాగరికత పునాదుల్లో ఒకటని. ఉప్పు మన పూర్వికులకిఆహార భద్రత కల్పించింది. అదే లేకపోతే మన పూర్వికులు ఎప్పటికప్పుడు దొరికిన ఆహారం మీదే బతకాల్సి వచ్చేది. లేదా నిత్యం ఆహారం కోసమే వెతుక్కోవాల్సి వచ్చేది, వలసలు వెళ్లాల్సి వచ్చేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉప్పే లేకపోతే మన పూర్వీకులు ఆహారాన్ని నిల్వ ఉంచుకోగలిగేవారే కాదు... కట్ చేస్తే... నేడు ఇంత ఎక్కువగా మనకు రక్తపోటు, గుండెపోటు వచ్చేవీ కాదు.

బీపీ, హార్ట్ ఎటాక్
అవును.. ఇప్పుడు ఉప్పు కంటపడితే చాలు.. ఈ భూమిపై కోట్ల మందికి ముచ్చెమటలు పడుతున్నాయి. వాళ్లందరికీ సాల్ట్ ఇప్పుడు విలన్‌గా కనిపిస్తుంది. అందుకే వాళ్లందరూ ఉప్పుకి 'ది ఫర్‌గాటెన్ కిల్లర్' అనే బిరుదు కూడా ఇచ్చేశారు. 'ఎందుకిదంతా..!' అనుకుంటున్నారా..? 'రుచి కోసమని అతిగా తింటే అంతే మరి. బీపీ, హార్ట్ ఎటాక్ రాక ఏం చేస్తాయి?' అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. చాలా కాలంగా జరిగిన పరిశోధనలు, వాటిపై ఆధారపడి జరిపిన సర్వేలు ఆ విషయాన్నే నొక్కి చెబుతున్నాయి. ఉప్పు అతిగా తినడం వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుందని... ఆ రక్తపోటు గుండెపోటుకి, గుండెకి సంబంధించిన ఇతర వ్యాధులకి కారణమవుతుందనేది వారి వాదన. అయితే ఉప్పుకి, గుండెపోటుకి డైరెక్ట్‌గా ఎలాంటి సంబంధం ఉందనేది మాత్రం నిర్ధారించలేకపోయారు. 62 శాతం గుండెపోటు కేసులకి, 49 శాతం ఇతర గుండె జబ్బులకి కారణం రక్తపోటేనని ప్రపంచ ఆహార సంస్థ జరిపిన సర్వేలో తేలింది.

ఇంత తింటాం
సగటున మనం రోజుకి తొమ్మిది గ్రాముల ఉప్పు తింటుంటే మన శరీరానికి ఐదు గ్రాములు సరిపోతుందని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందుకే ఉప్పు వాడకాన్ని తగ్గించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటోంది. 'అనుభవించేది మీరే.. ఇక మీ యిష్టం' అని చెబితే మాత్రం మనం వింటాం కాని మన నాలుకలు వింటాయా..? నాలుక నాకు నచ్చలా అంటే కడుపు ఖాళీగా ఉండాలే తప్ప మరేం చెయ్యలేదు. పైగా ఒకప్పుడు ఉప్పుని ఆహారం నిల్వ ఉంచడానికే వాడుకున్నా ఇప్పుడు ఉప్పు ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ సూపర్ మార్కెట్లపై దాడి చేయడం చూస్తూనే ఉన్నాం. 

'కొంచెం కారంగా.. కొంచెం ఇష్టంగా.. కొంచెం ఉప్పగా..' అని పాడుకుంటూ ఉప్పగా పుల్లగా ఉండే పొటాటో చిప్స్, సాల్ట్ బిస్కట్స్ కరకరా నమిలేస్తున్నాం. రంగు కోసమని, గరుకుదనం కోసమని వాటి తయారీలో ఇష్టం వచ్చినట్టుగా ఉప్పు వాడేస్తున్నారు. అందుకే చిప్స్ ప్యాకెట్లతో సావాసం చేస్తే వంట్లో ఉప్పు పెరుగుతుంది. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఈ అలవాటు మరీ ఎక్కువైంది. వాళ్లు ఇంటిలో తినేది ఎప్పుడో ఒకరోజే. ఎప్పుడూ బయటతిండే. అందుకే ఉప్పు తగ్గించండని సూచనలు, సలహాలు చేస్తున్నాయి ఆ దేశాలు.

అక్కడ ఉప్పుని నిషేధించారు
ఇదిలా ఉంటే మరో అడుగు ముందుకు వేసి ఏకంగా ఉప్పుపై నిషేధం విధించారు న్యూయార్క్ నగర పాలకులు. న్యూయార్క్‌లో నగరంలో ఉన్న ఏ రెస్టారెంట్‌లోనూ వంటల్లో ఉప్పు వాడకూడదని ఈ ఏడాది మార్చి ఐదున ప్రకటించింది నగరపాలక సంస్థ. ఒకవేళ వాడితే చెఫ్‌తో పాటు రెస్టారెంట్ యజమాని కూడా వెయ్యిడాలర్ల జరిమానా చెల్లించాలని పేర్కొంది. అమెరికా లాంటి దేశాల్లో ఆహారం వండేటప్పుడు పెద్దగా ఉప్పును వాడరు. తినేటప్పుడే ఎవరికి అవసరమైనంత ఉప్పు వాళ్లు చల్లుకుని తింటారు కాబట్టి చెఫ్‌లు చప్పిడి వంటలే చేయాలని తేల్చి చెప్పింది. ఉప్పుపైన యుద్ధమంటే మాపై యుద్ధమే అని, మా చేతులు కట్టేయడమేనని వాపోతున్నారు చెఫ్‌లు. మా ఉద్దేశం ప్రజారోగ్యం కాపాడడమే అంటున్న ప్రజాప్రతినిధులు మాత్రం ఉప్పుపై యుద్ధాన్ని విరమించుకోవడానికి ససేమిరా అంటున్నారు.

చరిత్ర సృష్టించింది..
న్యూయార్క్‌లో జరుగుతున్న 'యుద్ధం' ఉప్పు వాడకం మీద చేస్తున్నది. కాని కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్తే.. అప్పట్లో ఉప్పు యుద్ధాలకు, దురాక్రమణలకు కూడా దారి తీసింది. ఫ్రాన్సులో 1286 నుంచి 1790 వరకు అమలులో ఉన్న 'గాబెల్' అనే ఉప్పు పన్ను వల్ల ఉప్పు ధర మరింతగా పెరిగింది. పైగా ఎనిమిదేళ్లు దాటిన వాళ్లందరూ వారానికి కొంత ఉప్పు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనాలి. ఆ పన్ను కట్టలేని ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ పన్నుకి వ్యతిరేకంగా 1675లో ప్రజా పోరాటం కూడా జరిగిందక్కడ. బ్రిటిష్ పాలకులు విధించిన ఉప్పు పన్నుకి వ్యతిరేకంగా గాంధీజీ దండిలో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్య్రోద్యమంలోని కీలక ఘట్టాల్లో ఒకటనేది జగమెరిగిన సత్యం.

విలువైన వనరుగా ఓ వెలుగు వెలిగిన రోజుల్లో చిన్న పట్టణాల్ని సైతం నగరాలుగా మార్చేసింది ఉప్పు. బ్రిటన్‌లోని లివర్‌పూల్ నగరం అలా ఎదిగిందే. 19 శతాబ్దంలో Cheshire salt mines నుంచి తీసిన ఉప్పు ఎగుమతి అంతా లివర్‌పూల్ ఓడరేవు నుంచే జరిగేది. అంతర్జాతీయంగా ఉప్పుకి గిరాకీ పెరగడంతో వాణిజ్యం పెరిగింది.. లివర్‌పూల్ చిన్న టౌన్ నుంచి ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది. ఉప్పు గనులకు పెట్టింది పేరైన ఆస్ట్రియాలోని శాల్జ్‌బర్గ్ నగరాన్ని ఇప్పటికీ 'ది సిటీ ఆఫ్ సాల్ట్' అని పిలుస్తారు. క్రీస్తుపూర్వమే ప్రపంచ వాణిజ్యానికి పునాది వేసిన సిల్క్‌రోడ్ లాగే ఉప్పు ఉత్పత్తి, వాణిజ్యం పెరగడంతో యూరప్ అంతటా సాల్ట్ రోడ్లూ ఏర్పడ్డాయి ఒకప్పుడు. రోమన్ సైనికులకు జీతం 'ఉప్పు' రూపంలో ఇచ్చేవారంటే ఉప్పుకి ఎంత విలువుండేదో ఊహించుకోవచ్చు.

మంచుని తొలగించడానికీ మంటలు ఆర్పడానికీ
మంచు ఎక్కువగా కురిసే దేశాల్లో ఉప్పులేకపోతే నల్లటి రోడ్లన్నీ తెల్లటి మంచు పొర కింద మగ్గిపోవాల్సిందే. ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోవాల్సిందే. మరి ఉప్పేం చేస్తుంది..? అమెరికా, కెనడా, రష్యాలాంటి ధృవానికి దగ్గరగా ఉన్న దేశాల్లో మంచు తుపానులు సర్వసాధారణం. అడుగుల ఎత్తున కురిసిన మంచు రోడ్డు ఉపరితలానికి గట్టిగా అతుక్కుపోవడం వల్ల ఆ మంచు తొలగించడం యంత్రాలకు కష్టమవుతుంది. ఉప్పుకి ఉన్న లక్షణం ఏమిటంటే దాన్ని కలిపిన నీరు మైనస్ 21 డిగ్రీల వద్ద కూడా గడ్డకట్టకుండా ద్రవరూపంలోనే ఉంటుంది. అందుకే గడ్డ కట్టిన మంచు మీద ఉప్పు చల్లితే అది కరిగిపోతుంది. అలాగని కురిసిన మంచునంతా కరిగిస్తే ఆ నీళ్లెక్కడికి పోతాయి? పైగా అందుకు ఎంత ఉప్పు కావాలో.

పైగా ఆ ఉప్పంతా భూమిలో కలిస్తే రోడ్ల చుట్టుపక్కల నేలంతా చవుడుబారిపోవ డం ఖాయం. మంచు అంత గట్టిగా రోడ్డు ఉపరితాలనికి కరుచుకోకపోతే సులభంగా దాన్ని తొలగించవచ్చు. అందుకే మంచు కురిసే కాలంలో గడ్డకట్టిన ఉప్పును కాని, ఉప్పు నీళ్లు కాని రోడ్ల మీద చల్లుతారు. మంచు కురిసినపుడు ఆ ఉప్పు నీరు రోడ్డు ఉపరితలానికి, మంచుకి మధ్య ఒక అడ్డు పొరలా ఏర్పడుతుంది. ఆ నీటి పొర గడ్డకట్టదు కాబట్టి మంచు తొలగించే యంత్రాలు పని తేలికగా చేసేస్తాయి. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉత్పత్తి చేసే ఉప్పులో అధికశాతం ఈ రహదారులపై మంచుని తొలగించడానికే వాడతారు. ఆ దేశాల్లో హైవేల పక్క పెద్దపెద్ద ఉప్పు గోడౌన్లుంటాయి.
మంచుని తొలగించడమే కాదు.. మంటల్ని కూడా ఆర్పుతుంది ఉప్పు. మంటలనార్పే యంత్రాల్లో వాడే పదార్థాల్లో ఉప్పు ముఖ్యమైనది. మంటలు చెలరేగినపుడు ఉప్పు ఆ మంటల్లోని వేడిని గ్రహించడమే కాకుండా ఆక్సిజన్‌తో చర్యనొందుతుంది.. ఫలితంగా ఆ ప్రదేశంలో ఆక్సిజన్ తగ్గిపోయి మంటలు త్వరగా ఆరిపోతాయి.

వీటికి ఉప్పే ముడిసరుకు
చేపలూ మాంసాన్ని నిల్వ ఉంచి, ఎగుమతి చేసే పరిశ్రమలో ఉప్పు వాడతారని తెలుసు. మనం ఉపయోగించే వేల రకాల పీవీసీ (పాలీ వినైల్ క్లోరైడ్) వస్తువుల తయారీకి కూడా ఉప్పే కీలకమని తెలుసా..? అంతే కాదు ఎక్కువగా తింటే ప్రాణాలు తీసే ఉప్పు.. ప్రాణాలు నిలిపే ఎన్నో ఫార్మాసూటికల్స్ తయారీకి ముడిసరుకు కూడా. ఎలాగంటే.. ఈ రెండు ప్రరిశ్రమలకి అవసరమైన కీలక రసాయనాల్ని ఉత్పత్తి చేసే 'క్లోర్-ఆల్కలి' పరిశ్రమలకి ముడి సరుకు ఉప్పే. పెట్రో కెమికల్ పరిశ్రమకి ముడి చమురు ఎంత అవసరమో క్లోర్ ఆల్కలి పరిశ్రమకి ఉప్పు అంత అవసరం. దీన్లో ఉత్పత్తి చేసే వాటిలో క్లోరిన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రోక్లోరైట్ ముఖ్యమైనవి. వీటితో ఫార్మాసూటికల్ మందుల నుంచి మైక్రో చిప్‌ల దాకా, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నుంచి ప్లాస్టిక్ పైపుల దాకా మనం వాడే వేల వస్తువులు ఉప్పు పుణ్యమే.

సాల్టుకొక ఇనిస్టిట్యూట్...
ఇలా ఉప్పు ఉపయోగాలన్నిటినీ లెక్కపెడితే 14 వేలవుతాయి అంటోంది సాల్ట్ ఇనిస్టిట్యూట్. ఉప్పుకి సంబంధించి 'ఏ టూ జడ్' సమాచారాన్ని అందించడానికి దాదాపు శతాబ్దం క్రితమే వెలిసింది ఈ ఇనిస్టిట్యూట్. ప్రముఖ ఉప్పు తయారీదారులుకలిసి 1914లో నెలకొల్పిన ఈ సంస్థ కార్యాలయం అమెరికాలోని అలెగ్జాండ్రియా అనే చిన్న పట్టణంలో ఉంది. అటు సామాన్య ప్రజలకు, ఇటు తయారీదారులకు అవసరమైన సమాచారాన్ని అందించడమే కాదు.. పలు పరిశోధనలు కూడా చేస్తోందీ సంస్థ. అన్ని ఉపయోగాలున్న ఉప్పు గురించి స్కూల్ పిల్లలకి చెబితే చిన్నప్పటి నుంచే వారికి ఉప్పు విలువ తెలుస్తుంది కదా! అందుకే హైస్కూల్ టీచర్లకు ఉప్పు ఉపయోగాల గురించిన సమగ్ర పాఠ్య ప్రణాళికను తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు.

ఇది ఉప్పుకి ప్రత్యామ్నాయం
డయాబెటిక్ పేషెంట్ల కోసం చక్కెరకి ప్రత్యామ్నాయాలు మార్కెట్లో దొరుకుతున్నట్టే ఉప్పుకి కూడా ప్రత్యామ్నాయాలు వచ్చేశాయి. వాటిలో సోడియం క్లోరైడ్‌కి బదులుగా పొటాషియం క్లోరైడ్, పొటాషియం లాక్టేట్ ఉంటాయి. మన శరీరానికి సోడియం కన్నా ఎక్కువ మోతాదులో పొటాషియం కూడా అవసరమే. అయితే మనకు అవసరమైనంత పొటాషియం మనం తినే ఆహారంలో ఉండదు. అందుకే పొటాషియం తీసుకోవడం మంచిదేనంటున్నారు వీటి తయారీదారులు. కాని ఈ సాల్టు డాక్టరు సలహా మేరకే వాడాల్సి ఉంటుందట. డయాబెటిస్, కిడ్నీల వ్యాధులు ఉన్నవాళ్లు మాత్రం ఈ ప్రత్యామ్నాయాన్ని వాడకూడదు. మార్కెట్లో ఆల్సో సాల్ట్, లో సాల్ట్ పేర్లతో ఈ ఉప్పు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.